EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

    Author SHANKARAVAM NEWS | 16 Nov 2026, 06:28 PM | TELANGANA
    జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

    జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం
    -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
    రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి టీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
    మంగళవారం నాడు వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు.
    సమాజంలో ఎంతో గౌరవప్రదమైన జర్నలిజం వృత్తి పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై ఉంటుందని స్పీకర్ సూచించారు. ముఖ్యంగా ప్రజలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన తెలిపారు. సంచలనాలు, కల్పితాలు, అవాస్తవాలకు దూరంగా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, నిజాయితీగా సమాచారాన్ని అందించే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రజలు అక్కున చేర్చుకుంటారని ప్రసాద్ కుమార్ స్పష్టం చేసారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుందని, దశల వారీగా వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందించామని, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
    ఈ సభకు గౌరవ అథితిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే మరోవైపు జర్నలిస్టుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు తమ సంఘం 75యేండ్లుగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు అందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాట ఫలితమేనన్నారు. రాష్ట్రంలో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులను అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విరాహత్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ నుండి ప్రస్తుతం అందిస్తున్న తక్షణ సహాయాన్ని లక్షా రూపాయల నుండి 2లక్షలకు పెంచాలని, ఐదేళ్ల పాటు ప్రతి నెల మృతుని భార్యకు చెల్లించే 3వేల రూపాయల పెన్షన్ ను 10వేల రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. ఇంకా ఈ సభలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు వై. నరేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహాచారీ, శ్రీధర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీంలతో పాటు దాదాపు 300మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

    జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Additional Image