EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు!

    Author SHANKARAVAM NEWS | 16 Nov 2026, 06:11 PM | TELANGANA
    మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు!

    మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు!
    8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు
    హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆమె అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం (16-11-2026) ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించినట్లు భావిస్తున్న మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
    రూ.6.76 కోట్ల ఆస్తులు గుర్తింపు!
    ఏసీబీ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.6,76,45,738గా ఏసీబీ అంచనా వేసింది. వీటిలో మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.
    గుర్తించిన స్థిరాస్తుల వివరాలు:
    1. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
    2. జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల మరో ఓపెన్ ప్లాట్. ఈ రెండు ప్లాట్ల విలువ రూ.87.67 లక్షలు.
    3. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన ఫ్లాట్.
    4. అత్తాపూర్‌లోనే సుమారు రూ.2.45 కోట్ల విలువైన జీ+2 అంతస్తుల నివాస భవనం.
    5. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి. దీని విలువ రూ.29.70 లక్షలుగా అంచనా.
    చరాస్తులు, పెట్టుబడులు ఇవీ..
    - నగదు: రూ.5,47,500
    - తుల్జా భవానీ వైన్స్‌లో పెట్టుబడి: రూ.50 లక్షలు
    - షేర్లలో పెట్టుబడులు: రూ.1.30 కోట్లు
    - బ్యాంకు ఖాతాల్లో నిల్వలు: రూ.7,97,238
    - 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు: రూ.2.54 లక్షలు
    - రెండు కార్లు (మహీంద్రా XUV700, హ్యుందాయ్ క్రెటా), రెండు ద్విచక్ర వాహనాలు: మొత్తం రూ.50 లక్షలు
    - గృహోపకరణాలు: రూ.5.10 లక్షలు
    గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి!
    గుండు వాణిపై గతంలోనూ ఏసీబీ కేసు నమోదైంది. 30-09-2026న మోయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న సమయంలో ఓ పంచాయతీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ట్రాప్ కేసులో ఆమెను అరెస్టు చేయగా ప్రస్తుతం న్యాయస్థాన కస్టడీలో ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది.
    దర్యాప్తు కొనసాగుతోంది..
    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గుండు వాణిని హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు పీటీ వారెంట్‌పై హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. అదనపు ఆస్తులపై మరిన్ని వివరాల కోసం తనిఖీలు, ధ్రువీకరణ కొనసాగుతున్నాయని పేర్కొంది.
    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

    మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు! - Additional Imageమోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు! - Additional Image