🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 21 Oct, 2026 | Page: 1

సామాన్యుడికి బిగ్ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన బియ్యం ధర, ఇప్పుడు బస్తా రేటు ఎంతంటే?

సామాన్యుడికి బిగ్ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన బియ్యం ధర, ఇప్పుడు బస్తా రేటు ఎంతంటే?
సామాన్యుడి సంచికి భారీ చిల్లు పడుతోంది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు సన్న బియ్యం ధరలు అశనిపాతంగా మారుతున్నాయి. అన్నం ఉడికితే గానీ పూట గడవని బతుకుల్లో, ఇప్పుడు ఆ బియ్యం కొనాలంటేనే గుండె గుభేల్మంటోంది. గడిచిన నెల రోజులుగా బియ్యం ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాన్యుల పాలిట ఇదొక పెనుభారంగా పరిణమిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబ బడ్జెట్ తలకిందులు అవుతోంది.
మార్కెట్లో సన్న బియ్యం ధరల మంటలు తీవ్రస్థాయికి చేరాయి. నిన్న మొన్నటి వరకు క్వింటాలుకు ఎనిమిది వేల రూపాయలు పలికిన జైశ్రీరాం రకం బియ్యం, సోమవారం నాటికి ఏకంగా తొమ్మిది వేల రెండు వందల రూపాయలకు చేరుకుంది. ఒకప్పుడు ఆరు నెలలు లేదా ఏడాదికి సరిపడా బియ్యాన్ని ఒకేసారి కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రజలకు అలవాటుగా ఉండేది. కాలక్రమేణా బియ్యంలో పురుగులు పడుతున్నాయన్న భయంతో ఆ పద్ధతికి స్వస్తి పలికారు. ఇంట్లో బియ్యం అయిపోగానే నెలకు ఒక పాతిక కిలోల బస్తా తెచ్చుకోవడం దినచర్యగా మార్చుకున్నారు. దాదాపు ప్రతి కుటుంబానికి నెలకు ఒక బస్తా అవసరం ఉంటుంది. నెలనెలా పెరుగుతున్న ఈ ధరల మోత చూసి వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి మార్కెట్ ముఖచిత్రం పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. కేవలం నాలుగు రోజుల క్రితం రెండు వేల రూపాయలు ఉన్న పాతిక కిలోల బస్తా ధర, సోమవారం నాటికి రెండు వేల మూడు వందలకు ఎగబాకింది. కళ్లు మూసి తెరిచే లోపే బస్తాపై ఏకంగా మూడు వందల రూపాయల భారం పడింది. క్వింటాలుకు పన్నెండు వందల రూపాయలు అదనంగా పెరగడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం సాకుగా చూపుతూ వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా ధరల నియంత్రణపై అధికార యంత్రాంగం కనీసం నోరు మెదపకపోవడం ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.
🏠 Home