🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 06 Sep, 2026 | Page: 1

ప్రజా పాలన పేదలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.


ప్రజా పాలన పేదలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.
శనివారం అయన నల్గొండ జిల్లా, నకిరేకల్ మున్సిపాలిటీలో 344.92 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
హెలికాఫ్టర్ ద్వారా నకిరేకల్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి
వివిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం 32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ వైద్యశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాన్వాయ్ ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ మినీ స్టేడియం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి, 45.6 కోట్ల రూపాయల వ్యయంతో నకిరేకల్ - గురజాల రోడ్డు నుండి భైరవుని బండ వరకు, భైరవుని బండ నుండి అమ్మనబోలు రోడ్డు, మరియు అమ్మనబోలు నుండి రామంజపురం రోడ్డు నిర్మాణాలకు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయాల సముదాయానికి ,
9.85 కోట్ల రూపాయల వ్యయంతో నకిరేకల్ మున్సిపాలిటీలో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు , కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో నకిరేకల్ మున్సిపాలిటీలో నిర్మించనున్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. 2.74 కోట్ల రూపాయల వ్యయంతో కేతేపల్లి మండలం, గుడిపల్లి లో నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్ ను ప్రారంభించారు. అంతేకాక 3.63 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపాములలో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయగా, 17.5 కోట్ల రూపాయల వ్యయంతో నకిరేకల్ మున్సిపాలిటీలో పాత ఎన్ హెచ్ -9 రహదారి విస్తరణ, పటిష్టపరిచే పనులు ప్రారంభించారు. 6.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నకిరేకల్ మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి అలాగే 6.25 కోట్ల రూపాయల వ్యయంతో చిట్యాల లో నిర్మించనున్న చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ 30 నెలల ప్రజా పాలన కాలంలో రైతుల సంక్షేమం కోసం లక్ష 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదని, చివరి విడత రైతు భరోసా కూడా ఇవ్వలేదని ,తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల 30 వేల మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద గడచిన 32 నెలల కాలంలో 36 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. రైతులకు 15 వేల కోట్లు ఉచిత విద్యుత్ పై ఖర్చు చేశామని చెప్పారు .
ఆడబిడ్డలను ఆర్థికంగా వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసి 11 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని, హైదరాబాద్లో హైటెక్ సిటీ, శిల్పారామం వద్ద 1000 కోట్ల రూపాయల విలువచేసే మూడున్నర ఎకరాల స్థలంలో ఇందిరా మహిళా శక్తి ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించామన్నారు. 30 నెలల్లో 60 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళలకు ఇచ్చామని, మహిళలకు క్యాంటీన్ల నిర్వహణ, పెట్రోల్ బంకులు, విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పాఠశాలలో వంట వండే పనిని ఇప్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 67 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్థికంగా అండగా నిలబడినట్లు వెల్లడించారు.
యువత సంక్షేమంలో భాగంగా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ కు మహిళా కమిషన్ సభ్యురాలుగా పదవి ఇచ్చామని, అలాగే అన్ని వర్గాల ప్రతినిధులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని, ప్రజా పాలన పేదలు, ఆడబిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువత, సమాజంలో అన్ని వర్గాల కోసం అని చెప్పారు. మూడు కోట్ల 40 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, కోటి 60 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిఆర్డిఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు స్త్రీ నిధి కింద 108 కోట్ల,36 లక్షల 27 వేల రూపాయల చెక్కును అందజేశారు. అంతేకాక మెప్మా మహిళలకు 43 కోట్ల 49 లక్షలు రూపాయల రుణాల చెక్కును అందించారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన బ్రాహ్మణ వెల్లెములను పూర్తి చేశామని, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ వేగవంతం చేసి పూర్తి చేస్తామని, ఎంఆర్పి ఎస్ఎల్బీసీ హైలైవెల్ కెనాల్ పనులను సంవత్సరంలోపు పూర్తి చేస్తామని, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ,బునియదిగాని కాలువ లు పూర్తి చేస్తామని, మూసి ఆయకట్టుకు సంపూర్ణంగా నీళ్లు వచ్చేలా చేస్తామని ,ఎస్ఎల్బీ సి టన్నెల్ పనులను 2028 లోపు పూర్తి చేస్తామని, అలాగే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తేమని, అడిగిన వారందరి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 6 కేజీల సన్నబియ్యమిస్తున్నమని తెలిపారు .
జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకోవాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్లు, పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నదని తెలిపారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని, సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టించామని, గద్దర్ అవార్డులు ప్రకటించామని,అందెశ్రీ రచించిన పాటకు గౌరవం కల్పించామని, తమ ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల చూపిస్తున్న చొరవ చిన్నది కాదని అన్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రజా పాలన లో విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు.
" వెయ్యి రోజుల ప్రజా పాలన ప్రగతి సభ "పేరుతో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ,ఎం ఎల్ ఏ బీర్ల ఐలయ్య,ఎం ఎల్ సి లు నెల్లికంటి సత్యం,శంకర్ నాయక్, మునుగోడుఎం ఎల్ ఏ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి,తుంగతుర్తి ఎం ఎల్ ఏ మందుల సామేలు,భువనగిరి ఎం ఎల్ ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి,మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్మా రెడ్డి,దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్,
జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్,ఎస్ పి శరత్ చంద్ర పవర్, ఇతర అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home