🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 29 Jul, 2026 | Page: 1

కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు – దేవస్థానం ఈవో హెచ్చరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి స్పందించారు.
గత రెండు మూడు రోజులుగా కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులు భక్తుల వద్ద నుంచి నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడం వల్ల దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా దేవస్థానం కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులను ఈవో తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ ఈవోలు శ్రీమతి జయకుమారి, శ్రీ నాగుల మహేష్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్, ఆలయ ఉద్యోగులు మరియు నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.
🏠 Home