🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 27 Jul, 2026 | Page: 1

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ- ఫ్యాన్స్ కు పిలుపు

ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీశాయి. తన అభిమాన సంఘాలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, చేసిన సూచనలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. సినిమాలు, ప్రచార వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా చురుగ్గా సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలని అభిమానులకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభిమానులందరూ ఒకే చోట చేరడం వల్ల ఏర్పడే ఐక్యతకు ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఈ ఐక్యతకు ఒక మంచి ప్రయోజనం, దిశదశను తీసుకురావడానికి ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ బలాన్ని ఆడియో ఫంక్షన్లకో, తనను కలవడానికో పరిమితం చేయొద్దని, ప్రజలకు అవసరమైనంత సాయం అందించేలా సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. పేద కుటుంబాలకు చేతనైన సహాయం అందించాలని ధనుష్ స్పష్టం చేశారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలకు కేంద్రబిందువు అయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ కూడా టీవీకేను స్థాపించడానికి ముందు ఇలాంటి సామాజిక కార్యక్రమాలే చేపట్టారు. ఇప్పుడు ధనుష్ సైతం అదే మార్గాన్ని ఎంచుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అక్కడితో ఆగలేదాయన. సమాజ హితం కోసం మరింత మందిని ప్రోత్సహించాలని కూడా తన అభిమానులకు సూచించారు.
తమిళనాడు రాజకీయాల్లో సినిమా రంగానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుండి విజయ్ వరకు ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఊపందుకుంది.
🏠 Home